కోల్‌కతా: యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ నేడు 30 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే ఎన్నికల వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తూర్పు మిడ్నాపూర్‌లోని భగవాన్‌పూర్ నియోజకవర్గంలో ఈ తెల్లవారుజామున బాంబు దాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద భద్రతాసిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా.. కొందరు దుండుగులు వారిపైకి బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతాసిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని కోల్‌కతాకు తరలించారు.
భాజపా కార్యకర్త దారుణహత్య
పోలింగ్ జరుగుతున్న పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఓ భాజపా కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. కేశియారీలోని బేగంపూర్ ప్రాంతానికి చెందిన 35ఏళ్ల మంగల్ సోరెన్ ఈ ఉదయం తన ఇంటి బయట విగతజీవిగా కన్పించాడు. సోరెన్ తమ పార్టీ కార్యకర్తే అని, తృణమూల్ గూండాలే అతడిని హత్య చేశారని భాజపా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను జిల్లా అధికారులు కొట్టిపారేశారు. సోరెన్ మృతికి ఎన్నికలతో సంబంధం లేదని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనలో పశ్చిమ మిడ్నాపూర్‌లో అదనపు కేంద్ర బలగాలను మోహరించారు.
అభ్యర్థి కారుపై రాళ్లదాడి
సోల్బనీ ప్రాంతంతో సీపీఎం అభ్యర్థి, మాజీ మంత్రి సుశాంత ఘోష్ కారుపై దుండగులు రాళ్ల దాడి చేశాడు. ఈ ఉదయం పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా కొందరు తృణమూల్ మద్దతు దారులు ఆయన కారును అడ్డుకుని రాళ్లు విసిరినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టి ఆయనను అక్కడి నుంచి క్షేమంగా పంపించారు.
భాజపా.. టీఎంసీ ఆరోపణలు
మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ భాజపా, తృణమూల్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పోలింగ్ బూత్‌ను టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తీసుకున్నారని భాజపా ఆరోపించగా.. ఓటర్లను అడ్డుకుంటున్నారని తృణమూల్ దుయ్యబట్టింది.