తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే టీకా తీసుకున్న వారికీ కరోనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కోఠిలోని ఆ శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో రమేష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 24,49,330 డోసులు రాష్ట్రానికి వచ్చాయని.. వాటిలో 12 లక్షల టీకాలను ఇప్పటివరకు వినియోగించినట్లు చెప్పారు. 0.7 శాతం డోసులు మాత్రమే వృథా అయినట్లు తెలిపారు. తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రెండు రోజుల్లో హోలీ, ఆ తర్వాత ఈస్టర్, ఉగాది పండుగల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాస్ సూచించారు.
త్వరగా గుర్తిస్తే మంచిది: డీఎంహెచ్‌వో
వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తిస్తే మంచిదని డీఎంహెచ్‌వో రమేష్ రెడ్డి అన్నారు. వైరస్ బాధితుడు మరో ఐదారుగురు వ్యక్తులకు వ్యాప్తి చేసే అవకాశం ఉందన్నారు. తాజా పరిస్థితులకు అనుగుణంగా 10 వేల ఆక్సిజన్ పడకలు సిద్ధం చేశామని.. అన్ని రకాల ఔషధాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.