వైఎస్సార్ బీమా నిధులు విడుదల చేసిన సీఎం
తెలుగు తేజం, అమరావతి: పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీనికోసం వైఎస్పార్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తుందని చెప్పారు. అర్హులైన వారందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించి బీమా వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పరిహారం అందని వారికి వైఎస్సార్ బీమా నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా నిధులను విడుదల చేశారు. అర్హత ఉండీ లబ్ధి చేకూరని 12,039 కుటుంబాలకు బీమా కింద రూ.254.72 కోట్లను చెల్లించారు.
”బీమా పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. అయినప్పటికీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని కొనసాగిస్తోంది. గతంలో ప్రతి పాలసీకి పీఎంజేజేబీవై, ప్రధాన మంత్రి సురక్షా యోజన కింద కేంద్ర ప్రభుత్వం 50శాతం ప్రీమియం చెల్లించేది. 2020 మార్చి 31 నుంచి కేంద్ర ప్రభుత్వం చెల్లించడం ఆపేసింది. 2020 మార్చి నుంచి పథకాన్ని నిలిపివేస్తామని లేదంటే రాష్ట్రాలు కొనసాగించుకోవచ్చని తెలిపింది. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియాన్ని చెల్లిస్తోంది. గత ఏడాది అక్టోబరు 21న బ్యాంకులకు ప్రీమియం రూపంలో రూ. 510 కోట్లు చెల్లించాం.
బీమా అమలుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మరో మెలిక పెట్టింది. ఇంతకుముందు గ్రూపు ఇన్సూరెన్స్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తెరవాల్సి వచ్చింది. వాలంటీర్లు కష్టపడి ఇప్పటివరకు 62 లక్షల బ్యాంకు ఖాతాలను తెరిపించారు. బీమా పథకానికి 45 రోజులు కూల్ ఆఫ్ పీరియడ్ పెట్టారు. ఇది మూడో సమస్యగా మారింది. ప్రీమియం చెల్లించాక ఈ 45 రోజుల్లో ఎవరైనా చనిపోతే బీమా అందని పరిస్థితి నెలకొంది. ఇలా రకరకాల పరిస్థితులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే నిధులు విడుదల చేశాం. అర్హత ఉండీ బీమా అందనివారు 155214 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు” అని జగన్ వివరించారు.