రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాడ్పులు
నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం
తెలుగుతేజం, అమరావతి : ఎండలు, వడగాడ్పులతో రాష్ట్రం నిప్పులకుంపటిని తలపిస్తోంది. గురువారం భానుడు భగభగమన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 78 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. మరో 197 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ప్రజలు బెంబేలెత్తిపోయారు. తిరుపతిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో 42.8, అమరావతి, నెల్లూరులో 42.4, ఒంగోలులో 42.3, నందిగామలో 41.6, కర్నూలులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా శుక్రవారం, శనివారం కూడా కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సగటున 2-3 డిగ్రీలు అధికంగా, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42-46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అక్కడక్కడ తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. కాగా దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడి మయన్మార్ తీరం దిశగా పయనిస్తూ బలహీనపడనున్నది.
వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలు
నెల రోజులుగా ఎండలతో అల్లాడుతున్న కోస్తా, రాయలసీమ ప్రజలకు వచ్చే మూడు నెలలు కాస్త ఊరట కలగనున్నది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలలు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదుకానున్నాయి. సాధారణం కంటే కోస్తాలో 0.03 శాతం, రాయలసీమలో 0.26 శాతం తక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దేశంలో ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల నమోదుపై గురువారం నివేదిక విడుదల చేసింది.