Breaking News

ఇసుక నేరుగా కొనుక్కోవచ్చు!

తెలుగు తేజం, అమరావతి :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీలో కీలక సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా ఇకపై ఇసుక కావాలనుకునే వారు నేరుగా కొనుగోలు చేయవచ్చు. కొత్తగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టబోతున్న కాంట్రాక్టరు ఆఫ్‌లైన్‌ ద్వారా ఇసుక విక్రయాలు జరుపాలని స్పష్టం చేసింది. ఎవరైనా నేరుగా ఇసుక రీచ్, స్టాక్ యార్డ్‌కు వెళ్లి.. ఇసుక నాణ్యతను పరిశీలించుకున్న తరువాత అక్కడే నగదు చెల్లించి ఇసుక తీసుకోవచ్చునని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కొనుగోలుదారులు తమ సొంత వాహనాల్లో గానీ, కాంట్రాక్టర్‌కు సంబంధించిన వాహనాలతో గానీ ఇసుకను తీసుకెళ్లవచ్చని పేర్కొంది. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే కాంట్రాక్టర్ ఇసుకను విక్రయించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదిలాఉంటే.. ఇసుక రీచ్ సమీప గ్రామాల్లోని ప్రజలు ఎడ్ల బళ్లతో తీసుకెళ్లే ఇసుకకు మాత్రమే ఉచిత అవకాశం కల్పించారు. గతంలో ఇసుక రీచ్ ఉన్న గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ జాబితా నుంచి ట్రాక్టర్‌ను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తే డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు.. ఇసుక కాంట్రాక్టర్.. ప్రతీ రీచ్‌కు సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది.

అలాగే.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టాక్ యార్డులో ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఇక ఇసుక కొనుగోలు చేసే ప్రతీ కొనుగోలు దారుకు సంబంధిత బిల్లులు, వాహనం నెంబర్‌తో సహా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాల విషయంలో గనుల శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలంది. ఇక ఇసుక రీచ్ కాంట్రాక్ట్ పట్టిన కాంట్రాక్టర్.. ఇసుకను రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులకు, పేదల గృహ నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇసుక అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఇసుక పాలసీలో సవరణలకు సంబంధించి ఉత్తర్వులను ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు పంపించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *