షిమ్లా: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో భాగంగా.. 11వ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు. మంగళవారం గరిబ్ కళ్యాణ్ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ షిమ్లాకు వెళ్లారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. షిమ్లాలోని రిడ్గే మైదానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న 16 పథకాల పని తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని స్వయంగా కొందరు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇక పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000(2 వేలు చొప్పున మూడు దఫాలుగా) అందిస్తోంది. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ఇవాళ 11వ విడత డబ్బులు జమ చేసింది. దాదాపు పది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల ఖాతాలో పీఎం సమ్మాన్ నిధి నుంచి రూ.21 వేల కోట్ల రూపాయలను విడుదల చేశారాయన.