బడికి వెళ్ళి చదువుకుంటే గొప్పోడివి కావొచ్చని అమ్మ నాన్న ఎన్నో చెప్పి పిల్లల్ని బడికి పంపిస్తుంటారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన పంతుళ్లు, పంతులమ్మలు పక్క దారి పడితే పిల్లలకు పాఠాలు ఎలా చెప్తారు.. ఏం నేర్పిస్తారు. ఇళ్లను బార్లు చేసే ప్రబుద్ధులు ఉంటారు. కానీ బడిని కూడా బార్ చేసే ఉపాధ్యాయులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది.విద్యార్ధులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు అతిగా ప్రవర్తిస్తున్నారు. పాఠాలు చెప్పి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయురాలు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చింది. విద్యార్ధుల ఫిర్యాదుతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. కర్ణాటకలోని తమకూరు తాలూకాలోని చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.చిక్కసారంగి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మ మద్యం మత్తులో పాఠాలు చెప్పేది. ఆమె ఈ పాఠశాలలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా మద్యానికి బానిసైంది. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వచ్చే ఆమె విద్యార్థులను కొట్టడం, తిట్టడం వంటివి చేసేది. అంతేకాకుండా తోటి టీచర్లతో వాగ్వాదానికి దిగుతుండేది. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పద్ధతి మార్చుకోవాలని గంగలక్ష్మమ్మకు అనేకసార్లు సూచించారు. అయితే, గంగలక్ష్మమ్మ వారితో కూడా గొడవ పడేది.ఆమె మద్యం సేవించి తరగతులు బోధిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కంప్లైంట్ అందుకున్న అధికారులు టీచర్ టేబుల్‌ను పరిశీలించేందుకు ప్రయత్నించగా గంగలక్ష్మమ్మ వారిని అడ్డుకుంది. అనంతరం పోలీసులు, గ్రామస్తులు కలిసి టేబుల్ డ్రా తాళాలు పగులగొట్టి చూశారు. అందులో మద్యం సీసా, రెండు ఖాళీ సీసాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు, అధికారులు అవాక్కయ్యారు. ఈ పరిణామంతో.. గంగలక్ష్మమ్మ తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను బెదిరించింది.ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని పోలీసులు ఆమెను సముదాయించి బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి బీఈవో వాహనంలో ఆమెను తరలించారు. అనంతరం మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు టీచర్ గంగలక్ష్మమ్మను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు..