దిల్లీ : భారత్ జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ సహచర మంత్రులకు కొన్ని కీలక సూచనలు చేశారు. విదేశీ అతిథులకు రెండు రోజులపాటు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులంతా తమ అధికారిక వాహనాలను పక్కన పెట్టాలని ప్రధాని సూచించారు. ఎక్కువ మంది వీఐపీ వాహనాల్లో తిరిగితే ప్రోటోకాల్ సమస్యలు రావొచ్చని ఆయన భావించారు. అందుకే కేంద్ర మంత్రులు ‘భారత్ మండపం’, ఇతర వేదికల వద్దకు చేరుకోవడానికి షటిల్ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు.
జీ-20 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ‘జీ 20 ఇండియా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రధాని సూచించారు. విదేశీ ప్రముఖులతో సంభాషించే సమయంలో అందులోని అనువాదం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ యాప్‌లో అన్ని భారతీయ భాషలు, జీ-20 దేశాల తక్షణ అనువాద ఫీచర్‌ను పొందుపరిచారు. ఇతర ఫీచర్లు సైతం జీ-20 సదస్సు నడిచే తీరుతెన్నులు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటాయని కొందరు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మంది ముఖ్య నేతలు ఈ రెండు రోజుల సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ సంబంధిత విషయాలను విదేశాంగశాఖ కార్యదర్శి మోహన్ క్వాత్రా మంత్రులకు వివరించారు. కొందరు మంత్రులకు విదేశీ ప్రముఖులను ఆహ్వానించే బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా మంగళవారం దిల్లీ విచ్చేసిన నైజీరియా అధ్యక్షుడు బోల అహ్మద్ టినుబుకు కేంద్రమంత్రి ఎస్పీఎస్ సింగ్ బగేల్ స్వాగతం పలికారు.