తిరుపతి : తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారంమహాశాంతి వరుణయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి , ఈవో ధర్మారెడ్డి తదితరులు అర్చకులకు పసుపు వస్త్రాలను బహూకరించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరికీ మంచి జరగాలనే సత్సంకల్పంతో శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం తలపెట్టామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు యాగం నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు. నెల రోజుల క్రితం తిరుమల ధర్మగిరిలో నిర్వహించిన వరుణయాగం వల్ల వర్షాలు బాగా కురిశాయన్నారు. ఈ సంవత్సరంతో పాటు, వచ్చే సంవత్సరం కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ నిపుణుల సూచనల నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం, వారికి సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ టీటీడీ ఈ యాగాన్ని నిర్వహిస్తోందని వివరించారు. మూడు రాష్ట్రాల నుంచి అర్చకులు, దాదాపు 60 మందికి పైగా వైఖానస ప్రముఖులు, 30 మందికి పైగా వేద పండితులు, 215 మందికి పైగా రుత్వికులు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ యాగం వల్ల పరిపూర్ణంగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.