హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి కసరత్తు మొదలైంది. ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన నగరంలోని 23 నియోజకవర్గాల పరిధిలో 11,700 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. గ్రేటర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు పేద కుటుంబాలకు ఇంటి పట్టాలను అందించారు. ఈ క్రమంలో రెండో విడతకు సంబంధించి కూడా శుక్రవారం మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్షలో షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ నెల 21వ తేదీన గ్రేటర్ పరిధిలోని 23 నియోజకవర్గాలకు చెందిన మరో 13,300 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు అంతకుముందుగానే అర్హులైన లబ్ధిదారులకు సంబంధించి డ్రా తీయనున్నారు. మొదటి విడతలో మాదిరిగానే కలెక్టర్ల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా డ్రా విధానాన్ని చేపట్టనున్నారు. తద్వారా మానవ ప్రమేయం లేకుండా.. సాంకేతికంగా డ్రాలో పేర్లు వచ్చిన లబ్ధిదారులకు ఈ నెల 21న డబుల్ బెడ్రూం ఇళ్లను అందించనున్నారు. మొదటి విడతలో అందించినట్లుగానే మళ్లీ పండుగ వాతావరణంలో డ్రాలో పేర్లు వచ్చిన 13,300 మంది నిరుపేదలకు గౌరవంగా డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాను అందజేయనున్నారు.
విడతల వారీగా లక్ష ఇండ్లు పంపిణీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి, నిరుపేదలకు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 70వేల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా.. మిగిలిన వాటి పనులు చివరి దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిలో మొదటి విడతగా 11,700 ఇళ్లను పంపిణీ చేయగా.. ఈ నెల 21న మరో 13,300 మందికి అందించనున్నారు. ఇలా విడతల వారీగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు.
బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షలు
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9,100 కోట్లు వెచ్చించి గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి నిరుపేదలకు ఉచితంగా అందజేస్తున్నది. అయితే వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.50వేల కోట్ల పైనే ఉంటుంది. ఇళ్లు నిర్మించిన ఏరియాల్లోని బహిరంగ మార్కెట్‌తో అంచనా వేస్తే కచ్చితంగా ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుంది. ఇంత భారీస్థాయిలో ఆస్తిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండటంతో ఆయా కుటుంబాల సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి.
50-60 గజాలు ఉన్నా.. గృహలక్ష్మి
నగరంలో త్వరలోనే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. నగర ఎమ్మెల్యేలు సూచించిన మార్పులు-చేర్పులకు సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. నగరంలో ఖాళీ జాగా అనేది స్వల్పంగా ఉంటుంది. ముఖ్యంగా నిరుపేదలు తమకున్న 50-60 గజాల్లో కూడా రేకుల షెడ్డు వేసుకోవడం, చిన్నపాటి స్లాబు ఇంటిని కట్టుకుంటారు. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకం ద్వారా అలాంటి నిరుపేదలకు ప్రయోజనం కలిగేలా చూడాలని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు విన్నవించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సూచనాప్రాయంగా సానుకూలత వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీంతో డబుల్ బెడ్రూం రాని ఇలాంటి పేదలకు గృహలక్ష్మి ద్వారా ప్రయోజనం చేకూరనున్నది. దీంతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని గతంలోనే మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
తప్పు చేస్తే.. ఉద్యోగాల నుంచి తీసేస్తాం
ఇంత భారీస్థాయిలో విలువైన డబుల్ బెడ్రూం ఇళ్లను అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో లబ్ధిదారుల ఎంపిక అనేది అత్యంత పారదర్శకంగా జరుగుతున్నదని అర్హులైన దరఖాస్తు దారులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండానే ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యతను అధికారులకు అప్పగించడమే కాకుండా., ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసే బాధ్యతను కూడా కలెక్టర్లపై ఉంచింది. వారినే బాధ్యులుగా చేసింది. తప్పు చేసిన వారిని ఉద్యోగం నుంచి తీసే కఠిన నిబంధనలను రూపొందించినందున ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దనే స్పష్టమైన సంకేతాన్ని మంత్రి కేటీఆర్ ఇచ్చారు.