గ్యాంగ్టక్: సిక్కింలో మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. లొనాక్ సరస్సు దగ్గర ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో తీస్తానదికి వరద పోటెత్తింది. వరద నీటిలో 23 మంది జవాన్లు గల్లంతయ్యారు. తీస్తానది వరదల్లో చిక్కుకున్న 23 మంది జవాన్లు గల్లంతైనట్లు గౌహతి డిఫెన్స్ అధికారులు చెబుతున్నారు. వారికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు..మరోవైపు వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి..ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. చుంగ్తాంగ్ డ్యామ్ పరీవాహక ప్రాంతంలో కుండపోత కారణంగా 20 అడుగుల మేర వరద ప్రవాహం కనిపించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని నిమిషాల్లోనే పెను విలయాన్ని సృష్టిస్తూ ఒక్కసారిగా వరద పోటెత్తింది. డ్యామ్ నుంచి వచ్చిన వరద అంతా లాచన్ లోయలో ఆర్మీ శిబిరాలను చుట్టుముట్టేసింది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే క్యాంప్ వరదల్లో మునిగిపోయింది. 23 మంది గల్లంతైన జవాన్ల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.