న్యూ ఢిల్లీ : ఏపీ సీఎం జగన్ హస్తినలో రెండో రోజు బిజీ బిజీగా గడిపారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యి..కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్. వాళ్లిద్దరి మధ్య కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగింది. ఇక దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, చంద్రబాబు అరెస్టు పైనా కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమీక్షలో సీఎం జగన్ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న ప్రయత్నాల్లో ఉన్న కేంద్ర సర్కార్..తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 17వేల 600 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణాన్ని చేపబడుతోంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో టెలికాం సేవల విస్తరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత నాలుగు దశాబ్ధాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని తెలిపారు సీఎం జగన్. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం..తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ, బహుముఖ విధానం-సానుకూల ఫలితాలను అందించిందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఏపీ సర్కార్ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంద న్నారు. ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు తగ్గాయని వెల్లడించారు సీఎం జగన్. ఏపీలో 5 జిల్లాలో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు కేవలం అల్లూరి, పార్వతీపురం, మన్యంజిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని గుర్తు చేశారు జగన్. ఇక సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కూడా అడిగినట్లు సమాచారం. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే శనివారం ఉదయం సీఎం జగన్, ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది.