అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైఖరి అమానవీయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఈ ప్రభుత్వ వైఖరి అమానవీయం. ఆయన ఆరోగ్య సమస్యలపై మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని పవన్ వెల్లడించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఆందోళన చెందితే.. ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు- ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం, చంద్రబాబు విషయంలో ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఆయన కుటుంబసభ్యులు కోరారు.