తిరుపతి (తెలుగు తేజం న్యూస్ బ్యూరో ) : కేంద్ర ప్రభుత్వ సహకారం తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అభివృద్ధి జరుగుతోందని చాటి చెప్పే ప్రచార కార్యక్రమానికి తిరుపతి నుంచే శ్రీకారం చుడుతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. తిరుపతి లో ఆమె మీడియా తో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదన్నారు.రాష్ట్రం లో జరిగే అభివృద్ధి పనులకు అభివృద్ధి కి పెద్ద పీట వేసే నరేంద్రమోడీ ప్రభుత్వమే కారణమని ప్రజలు గమనించాలన్నారు. ఈ విషయాలను ప్రజలకు తెలియచేసే కార్యక్రమాన్ని తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. స్థానికంగా రూ 1700కోట్ల రూపాయల కేంద్రప్రభుత్వ నిధులతో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందని, అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం రూ 311కోట్ల రూపాయలతో జరుగుతోందని,ఐఐటి, ఐజర్ లాంటి విద్యాసంస్థలకు 600 నుంచి 800కోట్ల రూపాయలను అందించామని వివరించారు. స్మార్ట్ సిటీ పధకం కింద తిరుపతి నగరానికి రూ 1695 కోట్లను కేటాయించి 87 అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని,తిరుపతిలో 21వేల తాగునీటి కనెక్షన్లు, 16వేల మురుగునీరు కాలువల నిర్మాణానికి సహకారం అందించామని తెలిపారు.అభివృద్ధిలో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడవ స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం మోడీ చేస్తున్నారన్నారు. ఇందులో అన్ని రాష్ట్రాల సహకారం ఉంటేనే భారతదేశం అభివృద్ధిలో మూడవ స్థానంలోకి రాగలదని స్పష్టం చేసారు. ఆపై పురందేశ్వరి తిరుపతి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఆమెతో బి జె పి నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ మొదలైన వారు ఉన్నారు