విజయవాడ : జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను రూపొందించనున్నారు. మేనిఫెస్టో ప్రకటన లోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించే అంశంపైనా నేతలు చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి 100 రోజుల ప్రణాళికను ఈ భేటీలో ఇరు పార్టీలు సిద్ధం చేసుకోనున్నాయి. ఓటర్ జాబితా అవకతవకలపైనా ఉమ్మడి పోరు ప్రణాళికను తెదేపా జనసేనలు ప్రకటించనున్నాయి.
ఇప్పటికే ఇరుపార్టీలు ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఆత్మీయ సమావేశాల్ని పూర్తి చేసుకునందున్న, రానున్న రోజుల్లో నియోజకవర్గాల స్థాయిలోనూ ఆత్మీయ సమావేశాల నిర్వహణపై నేటి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. తాజా సమావేశానికి తెలుగుదేశం నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య హాజరవగా.. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావులు హాజరయ్యారు. అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలో ఇరు పార్టీల తొలి సమావేశం జరగ్గా… దానికి కొనసాగింపుగా నేడు రెండో సమావేశం కొనసాగుతోంది.