గన్నవరం :ఏపీపీఎస్సీ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను కఠినంగా శిక్షించాలని గన్నవరం
నియోజకవర్గ టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఓప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్ -1 అధికారులు నియామ కోసం నిర్వహించిన పరీక్షల మూల్యాంకనంలో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 2018 డిసెంబర్ 31వతేదీ టిడిపి ప్రభుత్వం 162 గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా 2019 లో అధికార పీఠం ఎక్కిన వైసీపీ ప్రభుత్వం 2019 మే నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది అని ఆరోపించారు. పరీక్ష పత్రాల మూల్యాంకన మాన్యువల్ గా చేయాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం డిజిటల్ పద్ధతిలో మూల్యాంకర్ నిర్వహించి అక్రమాలకు పాల్పడిందని ఆరోపణల వర్షం కురిపించారు. దీనిపై అభ్యర్థులు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయగా మ్యానువల్ పద్ధతిలో మూల్యాంకనం చేయాలని కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ మేరకు రెండు దఫాలుగా మూల్యాంకనం చేసి కోర్ట్ నుండి సైతం తప్పుదారి పట్టించారని తెలియజేశారు. ఏపీపీఎస్సీ పరీక్షల విధానంలో రెండోసారి మూల్యాంకనం ఉండదని అయినప్పటికీ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి అభ్యర్థుల నుండి భారీ ఎత్తున డబ్బు గుంజుకునేందుకు పరీక్ష పత్రాలను రెండోసారి మూల్యాంకనం చేసారని, కోర్టుకు ఒక్క సారి మాత్రమే మూల్యాంకను జరిపినట్టు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని విమర్శించారు. మంగళగిరి లోని హయ్ ల్యాండ్ లో రెండోసారి మూల్యాంకనం చేసినట్లు పూర్తి ఆధారాలతో అభ్యర్థులు కోర్టుకు తెలియజేయడంతో మొత్తం మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన హైకోర్టు 6 నెలల్లోపు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ అవినీతి కారణంగా 162 మంది డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఈప్రభుత్వం చెలగాటం ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. ఈఘటనకు బాద్యులైన ఎపిపిఎస్సి చైర్మన్, కార్యదర్శి పై చర్యలు తెసుకోవాలని వెంకట్రావ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో సైతం ఇదేవిధంగా అక్రమాలకు జరగ్గా అక్కడ అధికారులు పై చర్యలు తీసుకున్నారని ఇక్కడ కూడా బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వాన్ని ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజల గంగలో కలిపారని ఇక్కడ కూడా అదే విధంగా వైసిపిని బంగాళాఖాతంలో కలపాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. ఈమొత్తం వ్యవహారంలో రూ. 150కోట్లు చేతులు మారాయన్న అనుమానం వ్యక్తం చేశారు.