తెలుగు తేజం, విజయవాడ : రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ప్రమాదాలను అరికట్టి రోడ్డు ప్రమాదరహిత సమాజ స్థాపనలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములవుదామని డిప్యూటి ట్రాన్స్ పోర్టు కమిషనరు యం. పురేంద్ర పిలుపునిచ్చారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కార్యాలయం నుండి స్వరాజ్య మైదానం వరకు రవాణాశాఖ అధికారులు, ఉద్యోగులు, వాహనదారులు, వాహన చోదకులు, విద్యార్ధునీ విద్యార్ధులతో ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదాలు చేసుకొంటూ డిటిసి పురేంద్ర రోడ్డు భద్రతా అవగాహనా ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం వలన తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయన్నారు. వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు వలన జరిగే ప్రాణనష్టాలు, అంగ వైకల్యాలు వంటివి ఏర్పడిన పరిస్థితుల్లో ఆయా కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతమన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనాధలు అయినవారు, అందివచ్చిన కుటుంబసభ్యులను కోల్పోయిన తల్లిదండ్రులు నేడు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారన్నది వాస్తవం అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు రోడ్డుభద్రతా నిబంధనలను పాటించకపోవడమే వీటికి ప్రధాన కారణం అన్నారు. ట్రాఫిక్ని బంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంధ సంస్థలు చేపట్టే చర్యల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములైనప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టగలుగుతామన్నారు. విద్యార్థి దశనుండే రోడ్డు ప్రమాదాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతోపాటు రోడ్డు ప్రమాదాల వలన కలిగే దుష్ప్రరిమాణాలను వివరిస్తూ వాటికి బాధ్యులైన వారి కుటుంబాలు ఎదుర్కుంటున్న బాధలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించి చైతన్యవంతులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థినీ విద్యార్ధులు, వాహన డ్రైవర్లతో అవగాహనా సదస్సులను, ర్యాలీలను నిర్వహించనున్నామన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాలలోని ప్రధాన కూడళ్లనందు వాహనాల్లో యల్ సిడి ప్రొజక్టర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కల్పించేలా లఘుచిత్రాలను ప్రదర్శించనున్నట్లు డిటిసి యం. పురేంద్ర తెలిపారు. ఈ ర్యాలీలో ఆర్టిఓలు రాంప్రసాద్, ఏ.వి. సారథి, మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్స్ జి. సంజీవ్ కుమార్, యండి. అలీ, పరిపాలనాధికారులు సిహెచ్. శ్రీనివాసరావు, ప్రభాకరలింగం, పి. కవిత, రవాణాశాఖ ఉద్యోగుల అసోసియేషన్ జోనల్ అధ్యక్షులు యం. రాజుబాబు, ఉద్యోగులు నాగమురళీ, రామచంద్రరాజు, సత్యనారాయణ, శ్రీను,బి జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.