తెలుగు తేజం, విజయవాడ: గత పది సంవత్సరాలుగా,కండరాల క్షీణత వ్యాధి (muscular dystrophy) తో ఎంతో బాధ అనుభవిస్తున్న, అమరావతి మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ సలహాదారులు కలిశెట్టి రమేష్ బాబు నిన్న సోమవారం నందలూరు గ్రామం, రాజంపేట మండలం, కడప జిల్లాలో మృతి చెందడంతో ఆయన మృతికి మంగళవారం అమరావతి మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ధోని నూకరాజు మరియు సభ్యులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు ధోని నూకరాజు మాట్లాడుతూ ఈ కండరాల క్షీణత వ్యాధితో ఎంతోమంది బాధపడుతున్నవారికి రమేష్ బాబు అవగాహన కల్పించడంతోపాటు, ఈ వ్యాధికి మందులు గురించి దేశ విదేశాలలో పరిశోధించే శాస్త్రవేత్తలు మరియు నిపుణులతో సంప్రదింపులు చేయటం, తనలాగా బాధపడే వ్యాధిగ్రస్తులకు సమాచారాన్ని చేరవేయడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మరణించడం మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిగ్రస్తులు అందరికీ తీరని లోటు. భారతదేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకమంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. సహాయకులు లేకుండా వాళ్ళ పని వారు చేసుకోలేరు. అనేక సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తులు మందులు వస్తాయని, అందరూ ఆరోగ్యకరంగా ఉంటామని ఎంతో ఆశతో ఉన్నారు. అలాంటివారికి సహా సూచనలు ఇచ్చే వ్యక్తి లేకపోవడం ఎంతో బాధాకరం. అమరావతి మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు సభ్యులు ఆయన మరణ వార్తను ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి అరుదైన వ్యాధితో బాధపడేవారికి అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.