Breaking News

కీసర టోల్‌గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు

తెలుగు తేజం, కంచికచర్ల : సంక్రాంతి పండుగ, వరుస సెలవులు రావడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లోని స్వస్థలాలకు భారీగా ప్రజలు వాహనాల్లో బయలుదేరారు. కరోనా నేపథ్యంలో సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో టోల్‌గేట్ల వద్ద రద్దీ ఏర్పడింది. ఫాస్ట్‌ ట్యాగ్‌ ఉన్నప్పటికీ హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో కీసర టోల్‌గేట్‌ వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా వారం రోజుల పాటు టోల్‌ రుసుము రద్దు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు 3 నుంచి 4 వేల వాహనాలు ప్రయాణిస్తే, సంక్రాంతి రోజుల్లో 10 నుంచి 18 వేల వాహనాలు వస్తాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరే లోపు చౌటుప్పల్‌ మండలం పంతంగి, సూర్యాపేట జిల్లా కొర్ల పహాడ్‌, కృష్ణా జిల్లా చిల్లకల్లు, కీసర వద్ద టోల్‌ వసూలు కేంద్రాలున్నాయి. ఈ సారి ఆయా కేంద్రాల వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రద్దీ పెరిగినప్పుడు అదనపు సిబ్బంది వరుసలో ఉన్న వాహనాల దగ్గరకు వెళ్లి టికెట్‌ ఇచ్చేలా ఏర్పాటు చేశామని టోల్‌ సిబ్బంది చెబుతున్నారు. రసీదు ఇవ్వడానికి చేతి యంత్రాలను సిద్ధం చేశారు. ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు(ఈటీసీ) విధానంలో మెయిన్‌ సర్వర్‌కు యంత్ర పరికరం అనుసంధానం చేయడం ద్వారా టోల్‌ వసూలు ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. వీఐపీల వాహనాలను అనుమతించే దారిలోనూ చేతి యంత్రాలతో రుసుం వసూలు చేయనున్నారు. టోల్‌ వసూలు కేంద్రం వద్ద నగదు చెల్లించేందుకు ఒకే వరుస ఉండడంతో వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఫాస్టాగ్‌ కార్డులు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *