తెలుగు తేజం, ముసునూరు : కృష్ణాజిల్లాలో గుప్తనిధుల కలకలం రేగుతోంది. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం, గుల్లపూడిలో అర్ధరాత్రి సొరంగంలో గుప్తనిధుల వేట జరుగుతున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో YSR హెల్త్ క్లినిక్ భవనం నిర్మించేందుకు పునాదులు తవ్వుతుండగా పురాతన సొంరంగం బయటపడింది. సొంరంగంలో గుప్తనిధులున్నాయని ప్రచారం జరగడంతో అర్ధరాత్రి సొరంగంలో నిధులవేట జరుగుతోందని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం దావానలంలా వ్యాపించడంతో స్థానికులు సొరంగం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. సమాచారం అందుకున్న నూజివీడు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. సొరంగాన్ని పరిశీలించిన పోలీసులు ఆర్కియాలజీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో విజయవాడ నుంచి ప్రత్యేక బృందం గుల్లపూడి బయలుదేరింది. పురాతత్వ శాఖ అధికారులు సొరంగాన్ని పరిశీలిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోవైపు సొరంగంలో గుప్తనిధులు బయటపడితే ప్రభుత్వం స్వాధీనం చేసకొని గ్రామాభివృద్ధికి వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు మాత్రం సొరంగాన్ని పరిశీలించిన తర్వాతే ఏ విషయం చెప్పగలమంటన్నారు. గుల్లపూడిలో బయటపడిన సొంరంగా నూజివీడు సంస్థానాధీశులు తవ్వించిందేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. పురాతత్వ శాస్త్రవత్తల పరిశీలన అనంతరం దీనిపై మిస్టరీ వీడే అవకాశముంది. సొరంగం ప్రవేశం వద్ద పాతకాలం నాటి బండరాళ్లు కనిపించడంతో ఇది పురాతనకాలందేనని అందరూ భావిస్తున్నారు. ఆర్కియాలజీ అధికారులు వచ్చి సొరంగాన్ని పూర్తిస్థాయిలో పరిశీలిస్తే తప్ప ఈ మిస్టరీ వీడే అవకాశం లేదు.