విజయవాడ : టిక్కెట్టు లేకుండా, అనధికారికంగా ప్రయాణిస్తున్న వారు, అనధికారిక లగేజ్ ను తరలించడం వంటి రైల్వేలో జరుగుతున్న పలు రైల్వే వ్యతిరేక కార్యక్రమాలపై రైల్వే అధికారులు కొరడా ఝులిపించారు. విజయవాడ రైల్వే స్టేషన్ తో పాటు పలు స్టేషన్లలో 48 ట్రైన్స్ లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్కరోజే 3484 కేసులు నమోదు చేయడంతో పాటు, అపరాధ రుసుం కింద రూ.25 లక్షలను అధికారులు వసూలు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ చరిత్రలోనే ఒకేరోజు నమోదైన అత్యధిక పెనాల్టీ ఇదే కావడం రైల్వే వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. డివిజన్ లోని పలు విభాగాల్లో బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ మెగా డ్రైవ్ లో స్క్వాడ్ టిటిలు, స్టేషన్ సిబ్బంది, సిబ్బంది కొత్తగా రిక్రూట్ అయిన సిబ్బంది, టికెట్ కలెక్టర్లు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. మొత్తం 86 మంది టికెట్ చెకింగ్ సిబ్బంది 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది విజయవాడలో నిర్వహించిన ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు.