ఆర్వోబీ వంతెన నిర్మాణానికి 2నెలల్లో సీఎంతో భూమిపూజ: ఎమ్మెల్యే విష్ణు
గుణదల : నున్న నుంచి గుణదల వైపునకు రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో గుణదలలోని మూడు కాల్వలు, రైల్వే ట్రాకుపై నుంచి సమాంతరంగా ఆర్వోబీ వంతెన నిర్మాణానికి ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి ముందుగా గుణదల రైవస్ కాల్వ వెంబడి ఉన్న నివాసాలను తొలగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ 12 నివాసాలను లాండ్ ఆక్విజేషన్ కింద నగదు చెల్లించి పోరంబోకు స్థలంలో నివాసాలు ఉంటున్న మరో 60 మందికి ప్రభుత్వం ఇళ్లు కేటాయించి మూడు రోజుల నుంచి ఇళ్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే గుణదల రైల్వేట్రాకు వద్ద వాహనాల రాకపోకల సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గుణదల చుట్టుపక్కల ప్రజలకు ప్రధాన సమస్యగా మారిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు గుణదల, నున్న ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆర్వోబీ వంతెన నిర్మాణానికి 2 నెలల వ్యవధిలోనే సీఎం జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయిస్తానని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఆర్వోబీ వంతె న నిర్మాణానికి రూ.60కోట్లతో ప్రతిపాధనలు పంపించారన్నారు. అందుకనుగుణంగా జీవో రానుందన్నారు. అప్పుడు స్టేజ్-2 టెండర్‌కు వెళ్లనున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో బుడమేరుపై మరో రెండు వంతెనల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయన్నారు. శిథిలావస్థలోని బుడమేరు వంతెన స్థానంలో ఒకటి, ఇనుప వంతెన స్థానంలో మరొకటి నిర్మించనున్నట్టు తెలిపారు. రైవస్ కాల్వ, ఏలూరు కాల్వలపై ఉన్న వంతెనలు శిథిలావస్థలో ఉండటంతో వాటి స్థానంలో రెండు వరుసల వంతెనలు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారన్నారు. ఆర్వోబీ వంతెన నిర్మాణానికి అడ్డువచ్చిన 12 ఇళ్ల తొలగింపునకు ల్యాండ్ ఆక్విజేషన్ కింద రూ.13 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇరిగేషన్ పోరంబోకు స్థలంలో నివాసాలుంటున్న 60మందికి ఇళ్లు ఇచ్చామన్నారు.