దిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీతో కలిసి గోవా వెళ్లారు. దిల్లీలో వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలని ఆమెకు వైద్యులు సూచించడంతో విశ్రాంతి కోసం గోవా చేరుకున్నారు. గోవా పర్యటనకు ముందు పార్టీ విధాన నిర్ణయాల్లో అధ్యక్షురాలికి సూచనలు ఇచ్చేందుకు సోనియా మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్థిక, విదేశీ, జాతీయ భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఈ కమిటీలు నియమించారు. ఈ మూడు కమిటీల్లో సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చేర్చారు. అలాగే, ఆర్థిక వ్యవహారాల కమిటీలో పి.చిదంబరం, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ ఉండగా.. విదేశీ వ్యవహారాల కమిటీలో ఆనంద్ శర్మ, శశిథరూర్, సల్మాన్ ఖుర్షిద్, సప్తగిరి ఉలక; జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీలో గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, విన్సెంట్ పాల, వైతిలింగం ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు.