తెలుగు తేజం, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థీకరించిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిట సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్ రూపొందించి, వారికి ఉద్యోగపరమైన ప్రయోజనాలు అందజేయాల్సిన అవసరం ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన విజయవాడ ఆటోనగర్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల కమిషనరేట్‌లో గురువారం సమావేశం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్, సెలవుల నియమావళి, ప్రొబేషన్, ఉద్యోగుల ఆరోగ్య పథకం, కారుణ్య నియామకాలు, సర్వీసు పుస్తకం నిర్వహణ, శిక్షణ, శిక్షణ సంబంధిత పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు, డ్రెస్ కోడ్ తదితర అంశాలపై చర్చించారు. మార్చి 30లోపు ఆయా శాఖలు సర్వీసు పుస్తకాలు ప్రారంభించాలన్నారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్ డా.నారాయణ భరత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.