తెలుగు తేజం, అమరావతి: పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని పంట భూముల్లో ఇబ్బడి ముబ్బడిగా ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,049 ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ లే అవుట్లు వెలిసినట్లు 2015లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించగా ఇప్పుడు వాటి సంఖ్య పది వేలకు పైనే ఉంటుందని అంచనా. ప్రతి లే అవుట్లో సగటున 50 ఇంటి ప్లాట్లు ఉంటాయని అంచనా వేసినా దాదాపు 5 లక్షల మంది అక్రమ లే అవుట్లలో స్థలం కొనుగోలు చేసి మోసపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రామాల పరిధిలో కొత్తగా ఇళ్ల ప్లాట్లతో లే అవుట్ వేయాలంటే అనుమతి తప్పనిసరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే 2002 ఫిబ్రవరి 26న గ్రామ పంచాయతీ ల్యాండ్ డెవలప్మెంట్ (లేఅవుట్ అండ్ బిల్డింగ్)పై సమగ్ర విధానాలతో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త లే అవుట్ వేయాలంటే రోడ్లు, పార్కు, ఆటస్థలం లేదా పాఠశాల తదితరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని సంబంధిత గ్రామ పంచాయతీకి ఉచితంగా రాసివ్వాలి. గ్రామ పంచాయతీలకు ఇలా ఉచితంగా రాసి ఇవ్వాల్సిన స్థల పరిమితి లే – అవుట్ మొత్తం విస్తీర్ణంలో పది శాతం విస్తీర్ణానికి పైబడి ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా ఏర్పాటయ్యే అక్రమ లే–అవుట్లలలో నిబంధనల ప్రకారం ఇంటి ప్లాన్ అప్రూవల్, కరెంట్ కనెక్షన్, మంచినీటి కొళాయి కనెక్షన్లు మంజూరు చేయరు. బ్యాంకు లోను కూడా రాదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకున్నా ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.