మంగళగిరి (తెలుగుతేజం) : సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలలో ఒకటైన అమ్మఒడి ద్వారా పిల్లల చదువుకు ఆర్ధిక భరోసా ఇస్తూ తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ₹15000 నేరుగా జమ చేయడం, అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏంతో కృషి చేస్తోంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా స్థానిక మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ వీవర్స్ కాలనీ మున్సిపల్ ప్రభుత్వ హైస్కూల్ లో గురువారం విద్యార్థులకు టాబ్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ పాటశాలలో 1166 మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారని, విద్యార్థులకు తగిన రేషియోలో ఉపాధ్యాయులు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందని, అయినప్పటికీ తమ శక్తి వంచన లేకుండా విద్యార్థులకు బోధన చేయడానికి ప్రయత్నిస్తున్నామని, స్కూల్ విద్యా కమిటికీ మరియు విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో అందరం కలిసి మంచి నిర్ణయం తీసుకొని విద్యార్థుల భవితకు పాటుపడాలని కోరారు.
అలాగే స్కూల్ విద్యా కమిటీ సభ్యులైన కేతన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల చదువు గురించి తల్లి దండ్రులు ఎప్పటికప్పుడు ఆరా తీసుకోవాలన్నారు. అనంతరం స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్ జి. విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న లబ్ధిని అందుకొని విద్యార్ధుల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా విద్యా కమిటీ సభ్యులైన కన్నయ్య మాట్లాడుతూ పిల్లలు అందరూ ట్యాబ్ లు వాడుకొని ప్రయోజనం పొందాలన్నారు.
ఈ సందర్భంగా 244 మంది విద్యార్ధి, విద్యార్ధినులకు ట్యాబ్ లను విద్యాకమిటీ ద్వారా అందించారు. కార్యక్రమంలో విద్యా కమిటీ వైస్ చైర్మన్ జి. రవికుమార్, స్కూల్ టీచర్ పి. మాధవి, స్కూల్ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు.