ఢిల్లీ : భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించారు. ఈ మేరకు ఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం ప్రారంభమైన జీ20 సమావేశంలో ప్రధాని మోదీ ప్రకటించారు. సభ్యులందరి అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ అధినేత అజాలీ అసౌమనీని శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.
నేమ్‌ప్లేట్‌పై భారత్..
ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పు గురించి తీవ్ర స్థాయిలో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. జీ20 సమ్మిట్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు.. ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా చర్చీనీయాంశమైంది. తాజాగా జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ వద్ద టేబుల్‌పై ఉండే దేశం నేమ్‌ప్లేట్‌పై ఇండియాకు బదులు భారత్ అని రాసి ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా భారత్‌ను ఇండియాగా గుర్తించే వారు. ఇప్పుడు తొలిసారి ఓ అంతర్జాతీయ సమావేశంలో ఇండియాను భారత్‌గా గుర్తిస్తూ.. రౌండ్టేబుల్పై దేశం నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. జీ20 ప్రతినిధులను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న చైర్ వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌లో భారత్ అని రాసి ఉంది. మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. భారత్ మిమ్మల్ని స్వాగతిస్తోందన్నారు.