హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 5 వేల సీసీ కెమెరాల దృశ్యాలను ఒకేసారి తెరపై వీక్షించేలా ఏర్పాటు చేసిన బాహుబలి కమాండ్ కంట్రోల్ సెంటర్ (పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్, డేటా సెంటర్)ను బుధవారం ఉదయం తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేసి.. ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. బంజారాహిల్స్లో నిర్మిస్తున్న జంట పోలీస్ టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్కి సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే డయల్ 100కు అనుసంధానం చేయనున్నారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టులో భాగంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో దీన్ని నిర్మించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా.. వేగంగా వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించొచ్చు. ఏదైనా కూడలిలో ట్రాఫిక్ జాం ఏర్పడితే సిబ్బంది ప్రమేయం లేకుండానే సమీప కూడళ్ల నుంచి అటువైపు వాహనాలను రాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా ఈ కేంద్రం నుంచి సిగ్నల్స్ ఇస్తారు. సమీపంలోని ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేసి రద్దీని క్రమబద్ధీకరిస్తారు.