తిరుపతి: తిరుమల నడకదారిలో ఇటీవల చిరుత పులుల దాడుల నేపథ్యంలో తితిదే రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భక్తులకు చేతికర్రలను అందుబాటులోకి తెచ్చింది.
బుధవారం అలిపిరి మెట్ల మార్గం వద్ద చేతి కర్రల పంపిణీ కార్యక్రమాన్ని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ”చేతిలో కర్ర ఉంటే జంతువులు రావని శాస్త్రీయ వాదన. నడిచి వెళ్లే భక్తులకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చేతి కర్రలు చేతులు దులుపుకొనే ప్రక్రియ కాదు. మెట్ల మార్గంలో తితిదే భద్రత సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. చేతి కర్ర ఒక్కటే ఇచ్చి మా పని అయిపోయింది అనుకోవడం లేదు. విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం” అని కరుణాకర్‌రెడ్డి అన్నారు.
ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అలిపిరి మెట్ల మార్గంలో ప్రస్తుతం పదివేల కర్రలు భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మరో పదివేల కర్రలు అందుబాటులోకి తెస్తామన్నారు. వీటికోసం కేవలం రూ.45వేలు ఖర్చయిందని, భక్తులకు రక్షణ చర్యల్లో భాగంగానే చేతి కర్రలు అందిస్తున్నామన్నారు. పూర్వం నుంచి రైతులు, ప్రజలు కర్ర తప్పనిసరిగా చేతి కర్రలు వినియోగిస్తూనే ఉన్నారని తెలిపారు. భక్తులకు అలిపిరి మెట్ల మార్గంలో ఇచ్చిన చేతి కర్రలను ఏడో మైలు నరసింహస్వామి ఆలయం వద్ద తిరిగి స్వాధీనం చేసుకుంటామని ధర్మారెడ్డి చెప్పారు.