సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్
న్యూఢిల్లీ : దేశంలో జమిలి ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా.. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ ఓ ఆసక్తికరమైన సంగతిని వెల్లడించింది. దేశంలో పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీస్థాయి వరకు ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహిస్తే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని వెల్లడించింది. అయితే ఈ ఎన్నికల ప్రక్రియను కేవలం వారం రోజుల్లో పూర్తి చేయగలిగితే, రాజకీయ పార్టీలు నియమావళిని కచ్చితంగా పాటించగలిగితే ఈ ఖర్చును రూ.3లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లు తగ్గించవచ్చని తెలిపింది. దేశంలో జమిలి ఎన్నికలపై సీఎంఎస్ సంస్థ ఓ అధ్యయనం చేసింది. దాని ప్రకారం వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేసింది. ఇందులో ఎన్నికల సంఘం ఖర్చు చేసేది కేవలం 20 శాతం మాత్రమేనని తెలిపింది. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఖర్చు కూడా అందులో భాగం కాదని వివరించింది.
అధ్యయన వివరాలను సంస్థ విశ్లేషకుడు ఎన్ భాస్కర్‌రావు మీడియాకు వివరిస్తూ.. లోక్‌సభతోపాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే రూ.10 లక్షల కోట్లు ఖర్చువుతాయని తెలిపారు. ఇది కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చు మాత్రమే కాదని అన్నారు. పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారం కోసం చేసే ఖర్చు కూడా ఇందులో ఇమిడి ఉందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే పార్టీలు ప్రచారాన్ని ప్రారంభిస్తాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు రూ.1.20 లక్షల కోట్లు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీ (4,500 సీట్లు) ఎన్నికలకు రూ.3 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. దేశంలోని అన్ని మున్సిపాలిటీల (సుమారు 500)కు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే రూ. లక్ష కోట్లు వ్యయం కాగలవని అన్నారు. అలాగే జిల్లా పరిషత్ (650), మండలాలు (7000), గ్రామ పంచాయతీలు (2.50 లక్షలు)కు ఒకేసారి ఎన్నికలు జరిగితే రూ.4.30 లక్షల కోట్లు ఖర్చు కాగలవని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల (2019) సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం రూ.6,400 కోట్లు విరాళాలు వసూలు చేశాయని, కానీ కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయని తెలిపారు.