తెలుగు తేజం, కంచికచర్ల : విశాలాంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్ సంతాప సభ క్లబ్ అధ్యక్షులు నన్నపనేని సాంబశివరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నన్నపనేని మాట్లాడుతూ ముత్యాల ప్రసాద్ మరణం పత్రికా రంగానికి, నూతనంగా జర్నలిజం వృత్తిలోకి వచ్చిన జర్నలిస్ట్ లకు తీరనిలోటన్నారు. ముత్యాల ప్రసాద్ పాత్రికేయ వృత్తిలో నిబద్దతతో పనిచేశారన్నారు. ఎందరో జర్నలిస్ట్ లకు మార్గనిర్ధేశనం చేసారని కొనియాడారు. ఆయన తన రచనలు, సంపాదకీయాల ద్వారా ప్రజలను ఎంతో చైతన్యవంతం చేశారన్నారు. అక్షరమే ఆయుధమన్నారు. నైతిక విలువలతో పనిచేసిన మహోన్నతుడన్నారు. గ్రామీణ విలేకరిగా ప్రస్థానం ప్రారంభించి ఎడిటర్ స్థాయికి ఎదిగారన్నారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. ఎందరో జర్నలిస్టులకు మార్గదర్శకులయ్యారు ఆకస్మికంగా అందరికీ దూరమైయ్యారు. తొలుత ప్రసాద్ మృతికి సభ్యులు రెండు నిముషాలు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ కంచికచర్ల ప్రధాన కార్యదర్శి తోట ప్రసాద్ కార్యదర్శి జిల్లేపల్లి బుజ్జి, ఉపాధ్యక్షులు వేమల వెంకట్ బొక్క ప్రభాకరరావు, సంయుక్త కార్యదర్శి జెట్టి నారాయణబాబు, గౌరవ సలహాదారు షేక్ హఫీజుల్లా, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.