పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 51.91శాతం పోలింగ్ నమోదైంది. 71 స్థానాల్లో 1066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మోరాయించాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేశారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేసినా చాలా మంది మాస్క్‌లు లేకుండానే ఓటు వేసేందుకు బారులు తీరారు.
సైకిల్‌పై వెళ్లి.. పార్టీ గుర్తున్న మాస్క్‌తో ఓటేసిన మంత్రి
నయాగావ్, షేక్‌పుర, జముయి, బెల్హర్ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేశారు.ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాజపా అభ్యర్థి శ్రేయశీ సింగ్ నయాగావ్‌లో ఓటు వేశారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, మాజీ సీఎం జితిన్‌రాం మాంఝీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్ మంత్రి, భాజపా నేత ప్రేమ్‌కుమార్ సైకిల్‌పై వెళ్లి ఓటువేశారు. అయితే, ఆయన పార్టీ గుర్తు ఉన్న మాస్క్ ధరించి ఓటు వేయడం వివాదాస్పదంగా మారింది.
పేలుడు పదార్థాల కలకలం
పోలింగ్ సమయంలో ఔరంగాబాద్‌లో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం సృష్టించింది. దిబ్రా పోలీస్ స్టేషన్ సమీపంలో తనిఖీలు జరుపుతుండగా రెండు ఐఈడీలు గుర్తించిన సీఆర్పీఎఫ్ బలగాలు వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో ఔరంగాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. లఖిసరయి జిల్లాలోని బల్గుదార్ గ్రామంలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. క్రీడా మైదానంలో మ్యూజియం నిర్మాణం వ్యతిరేకిస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటువేసేందుకు ఎవరూ రాకపోవడంతో పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది.