జైపూర్ (రాజస్థాన్): వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాజస్థాన్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను విధించాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోట, జైపూర్, జోద్ పూర్, బికనేర్, ఉదయపూర్, అజ్మీర్, భిల్వారా, నాగోరి, పాలి, టాంక్, సికార్, గంగానగర్ జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో కరోనాను నిరోధించేందుకు డిసెంబరు 1 నుంచి 31వతేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాజస్థాన్ సర్కారు ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాలు, మల్టీప్లెక్సులు, సినిమాహాళ్లను కూడా డిసెంబరు 31వతేదీ వరకు మూసి ఉంచాలని నిర్ణయించారు.
సామాజిక, రాజకీయ, క్రీడా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను కూడా డిసెంబరు 31వతేదీ వరకు అనుమతించరు. నవంబరు 21 వతేదీన రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం 144 సెక్షన్ ను విధించారు. దీంతో పాటు ఫేస్ మాస్కు ధరించని వారికి విధించే జరిమానాను 200 నుంచి 500 రూపాయలకు పెంచారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం 2,518 మందికి కరోనా సోకగా 18 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 2,65,386 మందికి కరోనా సోకగా, వారిలో 2,292 మంది మరణించారు. నైట్ కర్ఫ్యూ సందర్భంగా మార్కెట్లు, వాణిజ్యసముదాయాలు రాత్రి ఏడు గంటలకే మూసివేయాలని సర్కారు ఆదేశించింది.