ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజల మరింత చేరువ కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం
కృష్ణాజిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశంలో మంత్రి కొడాలి నాని
తెలుగు తేజం, విజయవాడ : రాష్ట్రంలోని ఏ ఒక్క రేషన్ డీలర్ ను తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. రేషన్ డీలర్లను తొలగిస్తున్నారంటూ కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవాలకు చెక్ పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అసెంబ్లీలో డీలర్లను తొలగించే ఆలోచన లేదని తాను చెప్పానని మంత్రి తెలిపారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కృష్ణాజిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి కొడాలి నాని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ఏవైనా ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి అంద చేయాలనే ఉద్దేశంతోనే వార్డ్, గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. కార్డులు రేషన్ డిపో దగ్గరకు వచ్చి వేచి చూడకుండా నేరుగా ప్రజల ముందుకు తీసుకు వెళ్లి రేషన్ ను ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. అందులో భాగంగానే రేషన్ సరుకులను జనవరి ఒకటో తేదీ నుండి కార్డుదారుల ఇంటి ముందుకు తీసుకు వెళ్లి అందజేయనున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న రేషన్ డీలర్లు స్టాక్ పాయింట్లుగా ఉంటారని, అంతేగాని డీలర్లను తొలగించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రజలు తినగలిగేలా ఉండే బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, అందువల్లనే ఎఫ్‌సిఐ నుండి మంచి బియ్యాన్ని కొనుగోలు చేసి కార్డుదారులకు చేస్తున్నామని తెలిపారు. అందుకు ఏడాదికి మూడు వందల అరవై కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అయినా ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని అన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో మరణించిన 17 మంది రేషన్ డీలర్లకు నష్టపరిహారం అందేలా చూస్తానని, డీలర్లు తమ సమస్యలను లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో పాటు డీలర్ల సంఘాల నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తన స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని చెప్పారు. వచ్చే జనవరి ఒకటో తేదీ నుండి ఇంటింటికి బియ్యం పంపిణీకి 9, 200 వాహనాలను సమకూర్చుకుంటున్నామని, ఈ విధానం వల్ల 9, 200 ఉద్యోగాలు వస్తాయన్నారు. రేషన్ డీలర్ల కమీషన్, గన్ని బ్యాగ్ అంశాలపై కమిషనర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఆంధ్ర ప్రదేశ్ డీలర్ల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బి వెంకటేశ్వరరావు, ఏపీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకటరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకరి సూర్యారావు, ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు, కోశాధికారి మధుసూదన రావు తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి కొడాలి నానిని ఘనంగా సత్కరించారు.