విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మూలంగా ఈనెల 13వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. అలాగే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం టెలీ కాన్సెరెన్స్ ద్వారా అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
భారీ వర్షాలు కారణంగా పాడుపడిన, మట్టి గోడలతో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కలెక్టర్ సూచించారు. మత్స్యకారులెవరు సముద్రంలోకి వేటకు పోవద్దని ఆదేశించారు. విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలు వారివారి ప్రాంతాల తహశీల్దార్లను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీచేశారు.