తెలుగుతేజం ఇబ్రహీంపట్నం:మహిళలు విద్య, ఉపాధి, పరిశోధన రంగాల్లో ప్రగతి సాధించారని కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆర్.పద్మావతి అన్నారు. కొండపల్లిలోని నాగార్జున జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ‘స్త్రీల నాయకత్వం – కోవిడ్ 19 ప్రపంచంలో సమానత్వ సాధన’ అంశంపై జరిగిన సెమినార్ లో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కోవిడ్ 19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సమయంలో ఎంతోమంది వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందించారని ప్రశంసించారు. మహిళలు తమ తమ రంగాల్లో ఉన్నత స్థానాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు. మహిళల ప్రాధాన్యత పెరిగితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. జేవీవీ కొండపల్లి అధ్యక్షుడు ఎస్.నాగరాజు అధ్యక్షత వహించారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.మహాబాషా, జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.కామేశ్వరరావు, ఎస్.మస్తాన్ వలీ, ఎస్.కె.సర్దార్ సాహెబ్, ఎ.గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
మూలపాడు సప్తగిరి గ్రామీణ బ్యాంకు వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికార సదస్సు నిర్వహించారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ వి.జానకి రామారావు మాట్లాడుతూ మహిళలు బ్యాంకు ద్వారా అనేక సంక్షేమ పథకాలు పొందినట్లు గుర్తు చేశారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ కె.శివరామ ప్రసాద్, మూలపాడు, కేతనకొండ సర్పంచ్ లు చింతల భూలక్ష్మి, నెలకుర్తి నళిని ఆశాలత, వెలుగు సీసీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.