తెలుగు తేజం, కంచికచర్ల : మండల కేంద్రమైన కంచికచర్లలో నూతనంగా నిర్మించిన తలపెట్టిన శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవస్థానం ( శ్రీ రామాలయ పునర్నిర్మాణాని) కి బుధవారం నాడు శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సరిగ్గా ఉదయం 9 గంటల 21 నిమిషాలకు భక్తుల జై శ్రీరామ్ నినాదాల మధ్య పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరీ జీయరు స్వామి( శ్రీమదష్టాక్షరీ పీఠాధిపతులు విజయవాడ), శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవస్థానం (శ్రీ రామాలయం)కు, ఉపాలయాలు కు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమo లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు విశేషంగా తరలి వచ్చారు. శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవస్థానం తోపాటు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి ఉపాలయాలకు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తుల రాకకు తగ్గట్లుగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి శాంతి హోమం నిర్వహించారు. అనంతరం పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరీ జీయరు స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. రాములవారి ఆలయం పునర్నిర్మాణం చేయటం ఎంతో శుభ పరిణామమని, సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో, పూర్తి రాతి కట్టడంతో నిర్మాణం కానున్న ఈ రామాలయం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. శ్రీ రాముని ఆలయ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతం ఎంతో సుభిక్షంగా ఉంటుందన్నారు. అనంతరం త్రిదండి అష్టాక్షరీ జీయరు స్వామిని పూలమాలలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. ఆలయ ధర్మకర్తలు, భక్తులు హోమాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.