తెలుగు తేజం, జగ్గయ్యపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు పిలుపునిచ్చారు. గురువారం జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలో జగ్గయ్యపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో ఉదయం 10:00 గంటలకు “వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష” పథకం ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రసంగించనున్నట్లు తెలిపారు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, మహిళలు, యువకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.