నూజివీడు : నూజివీడు పట్టణానికి ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేయుచున్న సందర్భంగా ప్రజలంతా పాల్గొని సభను జయప్రదం చేయాలని శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. నూజివీడు పట్టణంలోని ద్వారకా ఎస్టేట్స్ లో బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములకు సంబంధించి శాశ్వత భూ హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అనేక రోడ్ల నిర్మాణాలకు సంబంధించి సభాస్థలి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హితోదికంగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. స్వర్గీయ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాములో నూజివీడుకు ట్రిపుల్ ఐటి కళాశాల, కృష్ణా జలాల రాక, మామిడి పరిశోధన కేంద్రం, మ్యాంగో హబ్ అభివృద్ధి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆనాడు సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు. డాక్టర్ వైయస్సార్ కు మించి వారి తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలకు సహకరిస్తున్నట్లు వివరించారు. పేద విద్యార్థుల చదువు, ఉచిత వసతి, పేదలకు ఆరోగ్యం, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు నిధులను జమ చేయడం అభినందనీయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళారీ వ్యవస్థకు సంబంధం లేకుండా నేరుగా మన రాష్ట్రంలోనే లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు సంక్షేమ నిధులను అందించిన ఘనత డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. గత పాలకుల మాదిరి ప్రచారాలకు పరిమితం కాకుండా, ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత – బైబిల్ – ఖురాన్ మాదిరి పవిత్రంగా భావించి అన్ని హామీలను నెరవేర్చినట్లు వివరించారు. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజల ఆధారాభిమానాలతో భారీ మెజారిటీ సాధించి మళ్లీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో మునిసిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.