విజయవాడ తెలుగుతేజం ప్రతినిది:జిల్లాలోని ఏడు నియోజక వర్గాలకు చెందిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీ రావు సోమవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం లోని నోవా, నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం ల భద్రత పై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవీఎం లకు కేంద్ర, రాష్ట్ర, సివిల్ పోలీసులతో ప్రభుత్వం మూడు అంచెల భద్రత కల్పించిందన్నారు. స్ట్రాంగ్ రూములకు ఉన్న తలుపులకు వేసిన తాళాలను, తాళాలకున్న సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. తనిఖీ అనంతరం సందర్శకుల రిజిష్టర్ లో కలెక్టర్ సంతకం చేశారు. మూడంచెలు గల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్మ్డ్ పోలీసు గార్డు, సివిల్ పోలీసు బందోబస్తులను పరిశీలించారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూంలు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు .