తెలుగు తేజం, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఏపీలో మరోసారి వేడెక్కుతోంది. కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో బుధవారం అన్ని పార్టీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
బుధవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ.. ప్రతినిధులను పంపాల్సిందిగా కమిషన్ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు ఎన్నికల కమిషన్ తీసుకోనుంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, బీజేపీ నుంచి పాక సత్యనారాయణ ఎన్నికల కమిషన్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు.
జనసేన, సీపీఎం, వైసీపీ ప్రతినిధులు హాజరయ్యే అంశం ఇంకా ఖరారుకాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మెజార్టీ పక్షాలు మొగ్గు చూపుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కరోనా ఉధృతి కారణంగా ఇప్పుడు సాధ్యంకాదని ఇప్పటికే అధికార పార్టీ మంత్రులు తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే నవంబర్ 4వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.