Breaking News

భారత్‌కు అండగా ఉంటాం : అమెరికా

న్యూఢిల్లీ : పాకిస్థాన్, చైనాలతో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న దశలో భారత దేశానికి మద్దతుగా నిలుస్తామని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగధనులకు నివాళులర్పించారు. ఈ ఏడాది జూన్‌లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులకు కూడా నివాళులర్పించారు. 

2+2 ఇండియా-యూఎస్ మినిస్టీరియల్ డయలాగ్ అనంతరం సంయుక్త ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా మైక్ పొంపియో మాట్లాడుతూ, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనిక దళాల సాహస వీరులను గౌరవించేందుకు జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించినట్లు తెలిపారు. భారత దేశం తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛలకు ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత దేశానికి అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ విసురుతున్న సవాలును మాత్రమే కాకుండా అన్ని రకాల ముప్పును ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా తమ మధ్య సహకారాన్ని పటిష్టపరచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది సైబర్ సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకున్నట్లు, ఇండియన్ ఓషన్‌లో జాయింట్ ఎక్సర్‌సైజ్‌లను ఇరు దేశాల నావికా దళాలు నిర్వహించినట్లు తెలిపారు. 

ప్రజాస్వామ్యం, శాసనబద్ధ పాలన, పారదర్శకతల మిత్రుల జాబితాలో చైనా కమ్యూనిస్టు పార్టీ లేదని అమెరికా నేతలకు, ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఎదురయ్యే ముప్పులకు వ్యతిరేకంగా సహకారాన్ని పటిష్టపరచుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 

2+2 ఇండియా-యూఎస్ మినిస్టీరియల్ డయలాగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో, అమెరికా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మార్క్ ఎస్పర్ పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈ చర్చలు జరిగాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *