తెలుగు తేజం, మైలవరం : అమ్మఒడి ఆంక్షల ఒడి అయిందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఈవూరి వినోద ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మైలవరం పట్టణంలోని తశీల్దార్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించి, డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు స్థానిక నేతలతో కలిసి మైలవరం లోని ఎన్టీఆర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం అప్లై చేసుకున్న అందరి విద్యార్థులకు వర్తింపజేయాలని, అమ్మఒడి కార్యక్రమంలో కొందరు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అమ్మఒడి రెన్యువల్ పేరుతో సుమారు ఒక్కొక్క విద్యార్థి మీద 1000 నుండి 2000 రూపాయల వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.అలాంటి పాఠశాలలను విద్యాశాఖ అధికారులు వెంటనే గుర్తించి తక్షణమే వాటి గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో పాత పుస్తకాలను కూడా కొందరు అక్రమంగా ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు ,స్పెషల్ ఫీజు, బుక్స్ పేర్ల మీద విచ్చలవిడిగా తల్లిదండ్రుల నుంచి విద్యా సంస్థ యాజమాన్యం దోచుకోవడం జరుగుతున్నది. విద్యాశాఖ అధికారులు స్పందించి అలాంటి స్కూళ్లను గుర్తించి ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పాల్గొన్నారు.