తెలుగు తేజం: ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ&ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం, కృష్ణా జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక డాక్టర్ ఎన్టీటీపీఎస్ గ్రౌండ్స్ లోని ఇంజినీర్స్ అసోసియేషన్ హాల్ నందు జరిగినది. కృష్ణా జిల్లా జనరల్ సెక్రెటరీ ఎం.రాఘవులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్టేట్ జనరల్ సెక్రటరీ ఎం. సునీల్ కుమార్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లాల పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాకు విచ్చేసి రాబోయే ఏప్రిల్ నెలలో అసోసియేషన్ నిర్వహించబోయే కార్యక్రమాల గురించి చర్చించారు.ముందుగా అసోసియేషన్ కార్యవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించింది.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎం. సునీల్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏప్రిల్ నెలలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అసోసియేషన్ భీమ్ ఫెస్టివల్ మరియు భీమ్ ర్యాలీ విజయవాడలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ యొక్క జయంతి ని ఒక పండుగలా నిర్వహించాలని ఆయన ఈ సమాజం కోసం చేసిన సేవ లను, త్యాగాలను ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ భీమ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి ని పురస్కరించుకుని 130 కార్లతో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బందర్ రోడ్ లోని భీమ్ ఫెస్టివల్ నిర్వహించే హాలు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు రాజకీయ ప్రముఖులు,రాష్ట్ర ఉన్నతాధికారులు మరియు రాష్ట్రం నలుమూలల నుంచి గెజిటెడ్ అధికారులు హాజరవుతారని ఆయన అన్నారు. అనంతరం కృష్ణాజిల్లా జనరల్ సెక్రెటరీ ఎం. రాఘవులు మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి, చీఫ్ ఇంజనీర్ శ్రీమతి ఎం. పద్మ సుజాత సారధ్యం లోని స్థానిక వీటీపీఎస్ మేనేజ్మెంట్ పరిసర ప్రాంత పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో అద్భుతంగా పని చేస్తూ అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సాధిస్తున్నారని అన్నారు. అనంతరం అసోసియేషన్ అంబేద్కర్ చూపిన పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం కు చెందిన బీఫార్మసీ చదువుతున్న పేద విద్యార్థి K. జీవన్ కు కాలేజ్ ఫీజు నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.అనంతరం ఇటీవలే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతులు పొందిన అసోసియేషన్ సభ్యులు ఆర్. రాజా నాయక్ మరియు ఎం డేవిడ్ రాజు లను అసోసియేషన్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్ సి హెచ్.ఆనంద్,అమరావతి హెడ్‌క్వార్టర్స్ ప్రెసిడెంట్ వై.సుధాకర్ బాబు, ట్రెజరర్ నాగరాజు మరియు అసోసియేషన్ గౌరవ సలహాదారులు విజయానంద్, కృష్ణాజిల్లా సలహాదారు ఎం ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.