గాజువాక, ‘మీరేం చేయాల్సిన పన్లేదు. ఏ సర్టిఫికెట్లు అవసరం లేదు.. మేమే అప్పులిస్తాం.. తీసుకుని మీ వీలున్నప్పుడు చెల్లించండి..’ అంటూ పలు యాప్ లు, సంస్థలు ఆన్లైన్ వేదికగా అప్పులిస్తున్నాయి. అయితే అవసరార్థం వాటిని తీసుకుంటున్న అవసరార్థులు తిరిగి చెల్లించలేక ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్నపాటి మొత్తాలకు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ వలలో చిక్కుకుని.. అది విష వలయం అని చాలా ఆలస్యంగా గ్రహిస్తున్నారు. ఆన్లైన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా గాజువాక సుందరయ్య కాలనీలో ఉంటున్న వెంకట సత్యనారాయణ, ఉషామణి లకు కుమార్తె ఆహ్లాద. ఎంబీఎ పూర్తి చేసిన ఆమె ఉద్యోగాన్వేషణలో ఉంది. కాగా, నిరుపేద కుటుంబమైన ఆమె.. ఇంటి అవసరాల నిమిత్తం తన ఫ్రెండ్స్ వద్ద అప్పు చేసింది. అవి తీరడానికి ఆన్లైన్ సంస్థలు, యాప్ లు ఇచ్చే స్వల్పకాలిక రుణాలను (కొన్ని యాప్ లు ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే లోన్లు కూడా ఇస్తున్నాయి.) తీసుకుంది. ఈ విషయం ఇంట్లోవాళ్లకు తెలియదు. కాగా, మంగళవారం ఆహ్లాద తల్లిదండ్రులు పనికోసం బయటకు వెళ్లారు. ఇంట్లో ఆమెకు వరుసకు సోదరుడైన యుగందర్ ఉన్నాడు. తల్లిదండ్రులు వెళ్లిన తర్వాత.. తాను కూడా స్నానానికి వెళ్తున్నానని చెప్పడంతో యుగందర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. లోపలికెళ్లి గడియ పెట్టుకున్న ఆహ్లాద మళ్లీ తలుపు తీయలేదు.అరగంట తర్వాత ఆహ్లాద తల్లి ఆమెకు ఫోన్ చేసింది. కానీ ఎంతసేపటికీ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన ఉషామణి.. యుగందర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోమంది. ఇంటికి వచ్చి చూసిన యుగందర్ తన కళ్ల ముందు కనబడుతున్న దానిని చూసి షాక్ కు గురయ్యాడు. ఒక గదిలో ఫ్యాన్ కు వేలాడుతున్న ఆహ్లాద బాడీ. దీంతో వెంటనే అతడు స్థానికులకు, ఆమె తల్లిదండ్రులకు సమాచారమందించాడు. ఇంటికి వచ్చి చూసిన ఆహ్లాద తల్లిదండ్రులు ఈ ఘోరాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యేలా విలపించారు.
విచారణ లో భాగంగా అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె కొన్ని యాప్ ల నుంచి రూ. 25 వేల దాకా అప్పులు తీసుకుందని తేలింది. ఆమె సెల్ఫోన్ డేటాను విశ్లేషించినాంతరం పోలీసులు స్పందిస్తూ.. కుటుంబ అవసరాల కోసం ఆహ్లాద ఒకరిద్దరి వద్ద రూ. 10 వేల దాకా అప్పులు చేసిందని అన్నారు. వాటిని తీర్చడానికి యాప్ ల నుంచి లోన్లు తీసుకుందని.. అయితే వాటి రీపేమెంట్ కోసం సదరు యాప్ ప్రతినిధులు వేధిస్తుండటంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వివరించారు. తమ కూతురు రెండ్రోజుల నుంచి దిగాలుగా ఉంటుందని ఆహ్లాద తల్లి కూడా వాపోయింది.