కట్నం విషయంలో వివాదం
పోలీసుల అదుపులో నిందితులు
తెలుగు తేజం , జగ్గయ్యపేట: కట్నం ఇవ్వలేదని అత్తమామల గొంతుకోశాడో వ్యక్తి. భార్యతో కలిసి నిలువునా వారి ప్రాణాలు బలిగొన్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానిచెందిన కోట ముత్తయ్య (63) సుగుణమ్మ (58) కూలీలు.దంపతుల ముగ్గురి సంతానంలో చివరి కుమార్తె మనీషా, గ్రామంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న నెమలిబాబు ప్రేమించుకోగా పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పెళ్లికి అంగీకరించే సమయంలో రూ.మూడు లక్షలు కట్నం డిమాండ్ చేశారు. రూ.1.50 లక్షలు ఇస్తారని పెద్ద మనుషులు రాజీ చేయడంతో 4 నెలల క్రితం వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం ఇవ్వకపోవడంతో సొమ్ము కోసం అత్తమామలపై అల్లుడు గొడవ పడేవాడు. ఈ క్రమంలో రూ.50 వేలకు మించి ఇవ్వలేనని ముత్తయ్య తేల్చి చెప్పేశాడు. వృద్ధులిద్దరిపై కోపం పెంచుకున్న ఆ జంట నాలుగు రోజుల క్రితం వారింటికి వచ్చింది. బుధవారం బాబు.. భార్య సహకారంతో గాఢ నిద్రలో ఉన్న అత్తమామల గొంతులను కత్తితో కోసి చంపేశాడు. అనంతరం భార్యాభర్తలిద్దరూ పరారయ్యారు. వృద్ధుల మధ్యలో నిద్రిస్తున్న నాలుగేళ్ల మనుమరాలు (మృతుల కుమారుడి కుమార్తె) ఉలిక్కిపడి లేచింది.
సమీపంలోని బంధువులను పిలుచుకురాగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు. నిందితులను చిల్లకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా తమ పరువు తీయడం వల్లే హత్యకు పాల్పడ్డామని, వృద్ధ దంపతులను హతమారిస్తే వారి పేరుతో ఉన్న కొద్దిపాటి ఆస్తి తమ సొంతమవుతుందనే ఈ పని చేశామని నిందితులిద్దరూ పరిచయస్తుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.