సెకండ్ వేవ్‌లో తొలిసారి 6వేలు దాటిన కరోనా కేసులు
తెలుగు తేజం అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్‌లో మొదటిసారి 6వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,962 పరీక్షలు నిర్వహించగా.. 6,096 కేసులు నిర్ధారణ కాగా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,48,231 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున బాధితులు కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,373కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,194 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,05,266కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,592 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,56,06,163 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,024, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.