*ఎలాంటి పొరపాట్లు జరగకుండా… నిబంధనల మేరకు పనులు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలి
*కౌంటింగ్ కు మూడు అంచల భద్రత
*కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలి
రాయచోటి (తెలుగుతేజం ప్రతినిది} : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు ప్రణాళిక బద్ధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి యం.అభిషిక్త్ కిషోర్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులను ఆదేశించారు.సోమవారం రాయచోటి కలెక్టరేట్ నందలి మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో… ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి సాయి ఇంజనీరింగ్ కళాశాలలో చేయవలసిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సాఫీగా విజయవంతంగా ముగిసిందని ఇందుకు కృషి చేసిన అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే జూన్ 4న నిర్వహించే ఎన్నికల ఓట్ల లెక్కింపు నిమిత్తం అన్ని విధాల సంసిద్ధంగా ఉండాలని, ఇందుకోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిబంధనల మేరకు పనులు పూర్తి చేయాలని సూచించారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెట్టాలని, అలాగే 8.30 గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ ప్రక్రియపై జారీ చేసిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేసుకోవాలన్నారు. కౌంటింగ్ హాలులో నిబంధనల మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలని కౌంటింగ్ కేంద్రాల్లో బ్యారికేడింగ్, ఆర్ఓ టేబుల్, కౌంటింగ్ స్టాప్ టేబుల్స్, ఏజెంట్ల సీటింగ్, లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్ సిస్టమ్స్, ఇంటర్నెట్ తదితర అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని ఆదేశించారు. అబ్జర్వర్ల లాంజ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా బ్యారీ కేడింగ్ ఉండాలని, అలాగే కౌంటింగ్ కేంద్రంలో మరియు స్ట్రాంగ్ రూము నుంచి ఈవీఎంలను కౌంటింగ్ హాలుకు తీసుకొచ్చే దారిలో బ్యారికేడింగ్ తో పాటు సీసీ కెమెరాలు ఉండాలని, కౌంటింగ్ హాలు లోకి ప్రవేశించేందుకు అధికారులకు మరియు ఏజెంట్లకు విడిగా బ్యారికేడింగ్ ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో నిర్దేశిత ప్రాంతంలో మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలని… ఆయా నియోజకవర్గాల రౌండ్ వారి ఫలితాల ప్రకటనలను మీడియా కేంద్రానికి వెనువెంటనే పంపాలని ఆర్వో లకు సూచించారు. కౌంటింగ్ కేంద్రానికి అవసరమైన లైటింగ్ ఏర్పాటుతో పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని, ఇందుకు తగ్గిన విధంగా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆహారం, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.