దుర్గమ్మ ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం
తెలుగు తేజం, విజయవాడ: టీటీడి విశ్వ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎస్వీ గోసంరక్షణ శాల నేతృత్వంలో అమలు చేయనున్న గుడికో గోమాత కార్యక్రమం సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, జేఈవో బసంత్ కుమార్, రమణ దీక్షితులు, దుర్గ గుడి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు, ఎమ్మెల్యే జోగి రమేష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోఛారణల నడుమ దుర్గ గుడికి గోవును, దూడను అందించారు. ఈ సందర్భంగా వైవీసుబ్బారెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఆలయంలో ఒక గోవును కచ్చితంగా పూజించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుంచి గోవులను తీసుకువచ్చి అమ్మవారికి ఇచ్చామని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలలో గోవులను అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరుగోసంరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు. భక్తులు గోవులను దానము చేయాలనుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానానికి గోవులను దానం చేయాలని కోరారు. గోవు సంరక్షణకు నిమిత్తము ఆలయ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. దాతలు కూడా ముందుకు వచ్చి టీటీడీ, హిందు ప్రచార పరిషత్‌కి గోవులను అందజేయాలని పిలుపునిచ్చారు.