తెలుగు తేజం, విజయవాడ : ప్రజల్లో నాడు, ప్రజల్లో నేడు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 90 శాతం అమలు చేశారని, అన్ని వర్గాలకు మేలు చేసేలా పాలన చేస్తున్నారన్నారు. తూర్పు నియోజకవర్గంలో అమ్మ ఒడి, వాహన మిత్ర, కుల వృత్తుల వారికి ఆర్ధిక సాయం, వైయస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు18వేలు, అందించామని తెలిపారు. వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రుణాలను ప్రభుత్వం హామీ చేసిందని గుర్తుచేశారు. చంద్రబాబు గతంలో అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారని, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రజల కోసం మంచి పనులు చేస్తోంటే టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని టీవీల్లో, పేపర్లో పడాలని చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 17నెలల కాలంలోనే 90శాతం హామీలను అమలుచేసిన ఏకైక సిఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.
కర్ర కట్టు ప్రాంతంలో ముంపు లేకుండా రిటైనింగ్ వాల్ కట్టాలని వైయస్సార్ అంకురార్పణ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన మరణంతో ఆ పనులు ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు కట్టిన రిటైనింగ్ వాల్ వల్ల వరద ముంపును ఆపలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకుని 122కోట్లు కేటాయించారు. మాకు పార్టీలు ముఖ్యం కాదు.. ప్రజల సమస్యల పరిష్కారమే ముఖ్యమని, వైసిపికి ఓటు వేయకపోయినా అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందాలని వైఎస్ జగన్ అన్నారు. త్వరలోనే రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తాం. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లకు విమర్శలు చేస్తున్నారు. టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వకుండా మోసం చేసింది టీడీపీ నేతలే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు, కార్పరేటర్లు ఇళ్లు ఇస్తామని పేదల నుంచి డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా? అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీ నేతలకు ఉందా? కోర్టులో కేసులు వేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకున్నారు. నోళ్లు ఉన్నాయి కదా అని సీఎం జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం. రోడ్లపై తిరగకుండా టీడీపీ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు’ అని అవినాష్ హెచ్చరించారు.